సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శించకుండా ప్రభుత్వ ఉద్యోగులపై నిషేధం
ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి వివిధ సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వాలపై విమర్శలు గుప్పిస్తున్న వారికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం కఠిన నిబంధనలను ప్రవేశపెట్టింది. ఇకపై అధికారులు సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యలు చేసేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సి వచ్చేలా పలు ప్రతిపాదనలతో రూల్ బుక్ ను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా వచ్చిన కార్టూన్ ను ఐఏఎస్ అధికారి, బార్వానీ కలెక్టర్ అజయ్ గంగ్వార్ లైక్ చేయడంతో మొదలైన వివాదం, తాజా ప్రతిపాదనలకు దారితీసినట్టు తెలుస్తోంది. ఆయన్ను వెంటనే సెక్రటేరియట్ కు బదిలీ చేసిన మధ్యప్రదేశ్ సర్కారు, వివరణ ఇవ్వాలని ఆదేశించింది కూడా.
ఇక తాజాగా కేంద్రం ప్రతిపాదించిన నిబంధనల ప్రకారం, ప్రభుత్వం, ప్రభుత్వ పెద్దలకు వ్యతిరేకంగా ఉన్న ఎలాంటి కంటెంట్ నూ ప్రోత్సహించేలా ఉద్యోగులు వ్యవహరించరాదు. వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయడానికి కూడా వీల్లేదు. అలా చేస్తే క్రమశిక్షణా చర్యలు ఎదుర్కోవాల్సి వుంటుంది. సర్వీసెస్ సెక్టారులోని వారు, టీవీ చానళ్లతో మాట్లాడుతున్న వేళ కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయి. ప్రస్తుతం ప్రతిపాదనలుగా ఉన్న ఈ నిబంధనలను సెంట్రల్ డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపారని, అభిప్రాయ సేకరణ తరువాత చట్ట సవరణ, నూతన నిబంధనల అమలు ఉంటుందని తెలుస్తోంది.